▶ Reels

యవ్వనం కోసం వాడే 'బోటాక్స్'తో ప్రాణాపాయం.. నకిలీ ఇంజెక్షన్లతో కలకలం..!

 

ముఖంపై ముడతలు తగ్గించుకుని, యవ్వనంగా కనిపించేందుకు నేటి రోజుల్లో చాలా మంది 'బోటాక్స్' (Botox) చికిత్సను ఆశ్రయిస్తు న్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన కాస్మెటిక్ చికిత్సల్లో ఇదీ ఒకటి. అయితే, తక్కువ ధరకు వస్తుందనో, సోషల్ మీడియా ఆఫర్లనో చూసి.. ఎక్కడ పడితే అక్కడ, నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఈ ఇంజెక్షన్లు తీసుకుంటే అందం పెరగడం అటుంచితే ప్రాణాలకే ప్రమాదమని తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి.


అసలు ప్రమాదం ఎక్కడంటే..? 


యూకేకి చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) ఇటీవల బోటాక్స్ వాడకంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ, లైసెన్స్ లేని బోటులినమ్ టాక్సిన్ ఇంజెక్షన్ల వాడకం వల్ల దుష్ప్రభావాలు పెరిగి, ఆసుపత్రి పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.


నిపుణుల పర్యవేక్షణ లేకుండా, నాసిరకం మందు వాడటం వల్ల రోగుల్లో 'బోటులిజం' (Botulism) అనే ప్రమాదకర పరిస్థితి తలెత్తుతోందని సంస్థ వెల్లడించింది. క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బాక్టీరియా విడుదల చేసే విషపదార్థం వల్ల ఈ అరుదైన వ్యాధి వస్తుంది. ఇది నేరుగా నాడీ వ్యవస్థ, కండరాలపై ప్రభావం చూపి పక్షవాతానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.


ప్రాణాల మీదకు తెచ్చిన చౌకబారు చికిత్స..


గతేడాది యూకేలో వెలుగుచూసిన ఓ ఘటనే నకిలీ బోటాక్స్ తీవ్రతకు నిదర్శనం. 36 ఏళ్ల కెల్లీ బెయిలీ అనే మహిళ ముఖంపై ముడతలు తగ్గించుకునేందుకు కేవలం 75 పౌండ్లకే (సుమారు రూ. 9712) మూడు ఇంజెక్షన్లు తీసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె కంటి చూపు మందగించడం ప్రారంభమైంది. కనురెప్పలు వాలిపోయే 'ప్టోసిస్' సమస్యతో పాటు ఆమె 'బోటులిజం' బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచి యాంటీ-టాక్సిన్లు ఇవ్వాల్సి వచ్చింది. చట్టవిరుద్ధమైన నకిలీ బోటాక్స్ ఇంజెక్షన్ వల్లే ఆమెకు ఈ పరిస్థితి వచ్చినట్లు వైద్యుల దర్యాప్తులో తేలింది.


"ఆసుపత్రి మంచం మీద ఉన్నప్పుడు నేను బహుశా చనిపోతున్నానేమో అనిపించింది, కానీ నాకు బతకాలని ఉండింది" అంటూ ఆ బాధితురాలు తన భయానక అనుభవాన్ని పంచుకుంది.


ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు..!


బోటాక్స్ లేదా ఇతర సంబంధిత సౌందర్య చికిత్సలు తీసుకున్న నెల రోజుల లోపు కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి:


ఆహారం లేదా నీరు మింగడంలో ఇబ్బంది కలగడం.


మాట ముద్దగా రావడం లేదా స్పష్టత లోపించడం.


శ్వాస తీసుకోవడంలో కష్టం.


తీవ్రమైన కండరాల బలహీనత, కంటి చూపు మందగించడం.


నిపుణులు ఏమంటున్నారు..? 


బోటులిజం అనేది అరుదైనప్పటికీ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని  వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించేందుకు వీలుగా వైద్యులు, రోగులు ఇద్దరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ ఉన్న క్లినిక్స్‌లో, సరైన అర్హత, శిక్షణ పొందిన నిపుణుల ద్వారా మాత్రమే ఇలాంటి చికిత్సలు తీసుకోవాలని, ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె ప్రజలకు సూచించారు.

Related Blogs


జ్వరం, జలుబుకు ఇంజెక్షన్.. 14 ఏళ్ల బాలిక మృతి! ఖమ్మంలో ఆర్‌ఎంపీపై కేసు

August 12, 2026

  జ్వరం, జలుబుతో...

READ MORE

NEET పరీక్ష నిర్వహణపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష.. జూలై 16న కీలక సమావేశం

July 10, 2026

 NEET పరీక్ష నిర్వహ...

READ MORE

దక్షిణాసియా ఆరోగ్య వ్యవస్థల కోసం AI రోడ్‌మ్యాప్.. WHO-SEARO, ISB కీలక భాగస్వామ్యం

July 10, 2026

 ఆరోగ్య రంగంలో **క...

READ MORE

'అనీమియా ముక్త్ భారత్ అభియాన్' కొత్త మార్గదర్శకాలు విడుదల..

July 1, 2026

 భారతదేశంలో రక్త...

READ MORE

క్విక్ డెలివరీ యాప్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రాణాంతక మందుల సరఫరా..?

June 30, 2026

ఈ-కామర్స్, క్విక్-క...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.