ఆధునిక జీవనశైలి ఉరుకులు పరుగులు, జంక్ ఫుడ్ వ్యామోహంతో మనలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి ఉదర సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. "కడుపు చల్లగా ఉంటేనే... శరీరం ఆరోగ్యంగా ఉంటుంది" అన్నది ఆరోగ్య నిపుణుల మాట. మనం తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణమైతేనే శరీరానికి కావలసిన శక్తి, పోషకాలు అందుతాయి.
మీ జీర్ణవ్యవస్థను పదిలంగా ఉంచుకుని, పేగుల ఆరోగ్యాన్ని (Gut Health) కాపాడుకోవడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన సంప్రదాయ, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకోండి..
పొట్టకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారాలు..
1. పెరుగు (Curd)..
జీర్ణక్రియకు అత్యుత్తమ ఔషధం పెరుగు. ఇందులో ఉండే 'లాక్టోబాసిల్లస్' అనే మంచి బ్యాక్టీరియా పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజూ భోజనంలో ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు దరిచేరవు.
2. గంజి లేదా కాన్జీ (Kanji Drink)..
నల్ల క్యారెట్లు, బీట్‌రూట్, ఆవాలు వేసి పులియబెట్టి (Fermentation) తయారు చేసే ఈ ఉత్తర భారత సంప్రదాయ పానీయం ప్రోబయోటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఇది పేగుల్లోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
3. మజ్జిగ (Buttermilk)..
ఆయుర్వేదంలో మజ్జిగను అమృతంతో సమానంగా భావిస్తారు. భోజనం తర్వాత ఒక గ్లాసు పలచటి మజ్జిగ తాగితే, కడుపు ఉబ్బరం తగ్గి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది పొట్టలో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
4. ఇడ్లీ, దోసె (Idli & Dosa)..
పిండిని రాత్రంతా పులియబెట్టి తయారు చేసే ఈ దక్షిణ భారత అల్పాహారాలు పొట్టకు చాలా తేలిక. పులియబెట్టడం వల్ల వీటిలోని పోషకాలు సులభంగా విడిపోయి, తిన్న వెంటనే జీర్ణమై శరీరానికి శక్తినిస్తాయి.
5. ఇంట్లో పట్టిన ఊరగాయలు (Homemade Pickles)..
బయట కొనే వాటికంటే, ఇంట్లో సహజ సిద్ధంగా తయారుచేసిన ఊరగాయలు మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటి తయారీలో జరిగే పులియబెట్టే ప్రక్రియ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అయితే ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వీటి వాడకం పరిమితంగా ఉండాలి.
6. సద్దన్నం / నానబెట్టిన బియ్యం (Soaked Rice)..
రాత్రంతా మట్టి కుండలో నీళ్లు పోసి నానబెట్టిన అన్నం (చలిది అన్నం) పేగులకు ఎంతో చలవ చేస్తుంది. ఉదయాన్నే దీన్ని తినడం వల్ల శరీరానికి 'బి' విటమిన్లు అందడమే కాకుండా, పేగుల ఆరోగ్యం మెరుగుపడి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
7. మొక్కజొన్న రాబ్ (Corn Raab)..
ఇది రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక అద్భుతమైన పానీయం. మొక్కజొన్న పిండి లేదా సజ్జలతో చేసే ఈ 'రాబ్' జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో, వాతావరణ మార్పుల నుండి శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
8. కొంబుచా (Kombucha)..
గ్రీన్ టీ లేదా బ్లాక్ టీకి చక్కెర కొన్ని రకాల బ్యాక్టీరియాను కలిపి పులియబెట్టి తయారు చేసే పానీయం ఈ 'కొంబుచా'. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ హెల్తీ డ్రింక్ ఇప్పుడు మన దగ్గర కూడా అందుబాటులో ఉంటోంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.
పులియబెట్టిన (Fermented) ఆహారాల్లో ఉండే ప్రోబయోటిక్స్ మన పేగుల్లోని మైక్రోబయోమ్‌ను (gut microbiome) ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవే మన జీర్ణశక్తికి మూలం.
నిత్యం పాటించాల్సిన జీవనశైలి నియమాలు..
ఈ ఆహారాలతో పాటు, పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని కనీస జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.. నీరు జీవామృతం.. ప్రతిరోజూ శరీరానికి సరిపడా (కనీసం 3 నుంచి 4 లీటర్లు) నీళ్లు తాగాలి. సమయపాలన.. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేసే అలవాటు చేసుకోవాలి. వేళ కాని వేళల్లో తినడం మానుకోవాలి.
వ్యాయామం..తిన్న ఆహారం జీర్ణం కావాలంటే శారీరక శ్రమ ముఖ్యం. రోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా యోగా చేయాలి. జంక్ ఫుడ్‌కు దూరం..నూనెలో వేయించిన పదార్థాలు, ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎంత తగ్గిస్తే ఉదరానికి అంత మంచిది. సమతుల్య ఆహారం..తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మీ ప్లేట్‌లో ఉండేలా చూసుకోండి. చిన్నపాటి జీవనశైలి మార్పులు, సరైన ఆహారపు అలవాట్లతో పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, భవిష్యత్తులో ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు మన దరిచేరవు.

