ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్న చాలామందికి వంట చేయడం ఒక పెద్ద ప్రహసనంగా మారింది. ఈ క్రమంలోనే సమయం ఆదా చేసుకోవడం కోసం ఇన్‌స్టంట్ నూడుల్స్, చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ బిస్కెట్లు, ‘రెడీ టు ఈట్’ (Ready-to-eat) స్నాక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి సులభంగా దొరకడమే కాకుండా, నోటికి రుచిగా ఉండి తక్షణమే ఆకలిని తీరుస్తాయి. కానీ, ఈ తాత్కాలిక సౌకర్యం వెనుక అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దాగి ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ప్రతిరోజూ తినడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో, ప్రధానమైన 10 దుష్ప్రభావాలను గురించి ఇప్పుడు తెలుసుకుందామా..
ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో కలిగే 10 ప్రధాన నష్టాలు..
1. ఊబకాయం (Obesity)..
ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో క్యాలరీలు, కృత్రిమ చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు అత్యధిక మోతాదులో ఉంటాయి. అదే సమయంలో శరీరానికి అవసరమైన పీచుపదార్థం (Fiber), పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండదు. ఫలితంగా పదే పదే ఆకలి వేసి, అతిగా తినేస్తారు. ఇది వేగంగా బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది.
2. మధుమేహం ముప్పు (Diabetes)..
ప్యాకేజ్డ్ ఆహారాల్లో వాడే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు (Refined Carbs), అధిక చక్కెరలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిని, టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తీవ్రమవుతుంది.
3. గుండె జబ్బుల ప్రమాదం (Heart Diseases)..
నిల్వ ఉంచిన, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియం (ఉప్పు) మోతాదులు ప్రమాదకర స్థాయిలో ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL)ను పెంచి, రక్తపోటును (bp) అదుపుతప్పుతాయి. దీర్ఘకాలంలో ఇది గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
4. జీర్ణకోశ సమస్యలు (Digestive Issues)..
ఈ తరహా ఆహారాల్లో ఫైబర్ దాదాపుగా శూన్యం. పీచుపదార్థాలు లేని ఆహారం జీర్ణవ్యవస్థ పనితీరును మందగించేలా చేస్తుంది. దీంతో మలబద్ధకం, గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నిత్యకృత్యం అవుతాయి.
5. రోగనిరోధక శక్తి క్షీణత (Weak Immunity)..
విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి తాజా ఆహారంలోనే లభిస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో రుచి కోసం, ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం వాడే రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ శరీర రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. దీనివల్ల వాతావరణ మార్పులకు సులభంగా ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది.
6. మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడి (Kidney Strain)..
రుచిని పెంచడానికి, నిల్వ ఉంచడానికి ఈ స్నాక్స్‌లో ఉప్పును విపరీతంగా వాడతారు. అధిక సోడియం వల్ల శరీరంలో నీరు నిలిచిపోయి (Water retention) రక్తపోటు పెరుగుతుంది. బీపీ పెరగడం వల్ల నేరుగా మూత్రపిండాలపై అదనపు భారం పడి, కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది.
7. మానసిక ఆరోగ్యంపై ప్రభావం (Mental Health)..
శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా మనం తినే తిండిపైనే ఆధారపడి ఉంటుంది. పోషకాలు లేని, రసాయనాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన (Anxiety), డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తుందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
8. కాలేయానికి చేటు (Liver Damage)..
ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే ఫ్రక్టోజ్ (ఒక రకమైన చక్కెర), అనారోగ్యకరమైన కొవ్వుల వల్ల కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఆల్కహాల్ తాగని వారిలో కూడా 'నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్' (NAFLD) రావడానికి ఈ జంక్ ఫుడ్ ప్రధాన కారణం.
9. పిల్లల ఎదుగుదలకు ఆటంకం (Impact on Kids' Growth)..
పెరిగే వయసులో పిల్లలకు సమతుల్య పోషకాహారం ఎంతో అవసరం. కానీ, రోజూ ప్రాసెస్డ్ స్నాక్స్, జంక్ ఫుడ్ తినడం వల్ల వారిలో విటమిన్లు, మినరల్స్ లోపం ఏర్పడుతుంది. ఇది వారి శారీరక ఎదుగుదలనే కాకుండా, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వంటి మానసిక ఎదుగుదలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది.
10. చర్మం, కేశాల అందవిహీనం (Skin and Hair Issues)..
అధిక చక్కెరలు, పోషకాల లేమి వల్ల చర్మం ముడతలు పడటం, మొటిమలు రావడం, సహజ కాంతిని కోల్పోవడం జరుగుతుంది. అలాగే కుదుళ్లకు తగిన పోషణ అందక జుట్టు బలహీనపడి విపరీతంగా రాలిపోతుంది. నాలుకకు రుచినిచ్చే ప్రాసెస్డ్ ఫుడ్స్ భవిష్యత్తులో ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడతాయి. కాబట్టి, వీలైనంత వరకు తాజా కూరగాయలు, పండ్లు, ఇంట్లో వండిన సహజమైన ఆహారాన్ని తీసుకోవడమే సంపూర్ణ ఆరోగ్యానికి శ్రీరామరక్ష.

