కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఇంటి వాతావరణాన్ని స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇంటికి అదనపు అందాన్ని తీసుకురావడంతో పాటు, గాలిలోని మలినాలను తొలగించి స్వచ్ఛమైన గాలిని అందించడంలో 'ఇండోర్ ప్లాంట్స్' (Indoor Plants) అద్భుతంగా పనిచేస్తాయి. తక్కువ నిర్వహణతో ఇంటికి పచ్చదనాన్ని, సానుకూల వాతావరణాన్ని అందించే ఐదు అద్భుతమైన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకర్షణీయమైన 5 ఇండోర్ ప్లాంట్స్ ..
1. స్నేక్ ప్లాంట్ (Snake Plant)..
ఇండోర్ ప్లాంట్స్‌లో దీనికి చాలా ఆదరణ ఉంది. పొడవాటి ఆకుపచ్చని ఆకులతో ఉండే ఈ మొక్క, ఇంటికి మోడ్రన్ లుక్‌ను తీసుకువస్తుంది. దీనికి పెద్దగా సూర్యరశ్మి, తరచుగా నీరు అవసరం లేదు. బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా మొక్కల సంరక్షణకు సమయం కేటాయించలేని వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
2. మనీ ప్లాంట్ (Money Plant)..
మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే మొక్క ఇది. దీన్ని కేవలం మట్టిలోనే కాకుండా నీళ్లలో కూడా సులభంగా పెంచుకోవచ్చు. దీని తీగలను బాల్కనీలు, లివింగ్ రూమ్ గోడలకు అలంకరించు కుంటే ఇంటికే కొత్త అందం వస్తుంది. ఇది చాలా వేగంగా పెరుగుతుంది, పైగా దీని నిర్వహణ కూడా సులభమే.
3. పీస్ లిల్లీ (Peace Lily)..
మీ ఇంటికి మరింత ఆకర్షణీయమైన లుక్ ఇవ్వాలంటే పీస్ లిల్లీని ఎంచుకోవచ్చు. ముదురు ఆకుపచ్చని ఆకులు, వాటి మధ్యలో వికసించే తెల్లటి పూలు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తాయి. తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశంలో కూడా దీన్ని ఉంచవచ్చు. కుండీలోని మట్టిలో ఎప్పుడూ కాస్త తేమ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.
4. అరెకా పామ్ (Areca Palm)..
ఇంట్లో ఏ మూలన ఉంచినా ఇది నాచురల్ అండ్ ప్రీమియం లుక్ ఇస్తుంది. గుబురుగా, పొడవుగా పెరిగే దీని ఆకులు గదిని తాజాదనంతో నింపేస్తాయి. డ్రాయింగ్ రూమ్, ఆఫీస్ లేదా ఇంటి ఎంట్రన్స్ వద్ద ఉంచడానికి ఇది చాలా బాగుంటుంది. దీనికి నేరుగా ఎండ తగలకూడదు (Indirect sunlight), అలాగే మితంగా నీరు అందించాలి.
5. స్పైడర్ ప్లాంట్ (Spider Plant)..
సన్నటి, ఆకర్షణీయమైన ఆకులతో ఉండే స్పైడర్ ప్లాంట్ చిన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు బాగా సరిపోతుంది. దీన్ని చిన్న కుండీల్లో లేదా బాల్కనీలో హ్యాంగింగ్ పాట్స్‌లో పెంచుకోవచ్చు. తక్కువ వెలుతురులో కూడా ఇది చక్కగా పెరుగుతుంది. ఇది ఇంటి వాతావరణాన్ని క్లీన్ చేయడంలో ముందుంటుంది.
ఇండోర్ ప్లాంట్స్ పెంపకంలో పాటించాల్సిన చిట్కాలు..
మొక్కలకు అవసరమైనంత వరకే నీరు పోయాలి. అతిగా నీరు పోస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. మట్టిలో తేమ శాతాన్ని గమనిస్తూ ఉండాలి.ఈ మొక్కలకు నేరుగా ఎండ తగలకపోయినా, పరోక్షంగా సహజమైన వెలుతురు తగిలేలా కిటికీల వద్ద ఉంచడం మంచిది. ఆకులపై దుమ్ము చేరకుండా అప్పుడప్పుడు పొడి గుడ్డతో శుభ్రం చేస్తుంటే, అవి మరింత పచ్చగా, నిగనిగలాడుతూ కనిపిస్తాయి.

