జ్వరం అనేది శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అనారోగ్య సమస్యకు సంకేతం. జ్వరం వచ్చినప్పుడు శరీరం సహజంగానే బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో అందరి మదిలో మెదిలే ఒక సాధారణ సందేహం.. జ్వరంగా ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా..? కూడదా..?
స్నానం చేస్తే జ్వరం మరింత పెరుగుతుందని కొందరు భయపడితే.. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్నానం చేయడం మంచిదని మరికొందరు అంటుంటారు. అయితే, ఈ విషయంలో జ్వరం తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జ్వరంలో ఉన్నప్పుడు స్నానం చేయడంపై డాక్టర్లు ఇచ్చే సలహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
తేలికపాటి జ్వరం ఉన్నప్పుడు..
జ్వరం తీవ్రత తక్కువగా ఉండి, పెద్దగా నీరసం అనిపించకపోతే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం సురక్షితమే. దీనివల్ల శరీరంపై ఉన్న చెమట, జిగట తొలగిపోయి రోగికి కాస్త ఉపశమనం కలుగుతుంది. అయితే, ఇక్కడ నీటి ఉష్ణోగ్రత చాలా ముఖ్యం. మరీ చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలో వణుకు పుడుతుంది. అలాగని మరీ వేడి నీటితో స్నానం చేసినా శరీరంపై అదనపు భారం పడుతుంది. కాబట్టి గోరువెచ్చని నీరు మాత్రమే ఉత్తమం.
తీవ్రమైన జ్వరం ఉంటే మాత్రం వద్దు..!
ఒకవేళ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండి, శరీరం వణకడం, తల తిరగడం, విపరీతమైన నీరసంగా ఉండటం లాంటి లక్షణాలు ఉంటే స్నానం చేయకపోవడమే మంచిది. మంచం పైనుంచి సొంతంగా లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్నానానికి దూరంగా ఉండాలి. ఆ సమయంలో శరీరానికి పూర్తి విశ్రాంతి, తగినన్ని ద్రవ పదార్థాలు చాలా అవసరం.
స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
స్నానానికి ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటినే ఉపయోగించాలి.
బాత్రూమ్‌లో ఎక్కువసేపు గడపకూడదు. వీలైనంత త్వరగా స్నానం ముగించాలి.
స్నానం పూర్తయిన వెంటనే పొడి టవల్‌తో శరీరాన్ని త్వరగా, పూర్తిగా తుడుచుకోవాలి.
తడి జుట్టుతో లేదా తడి దుస్తులతో ఏసీ గదుల్లో లేదా చల్లటి ప్రదేశాల్లో తిరగకూడదు.
బాగా నీరసంగా అనిపిస్తే, బాత్రూమ్‌లో జారిపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యుల సహాయంతో స్నానం చేయడం సురక్షితం.
చల్లటి నీటితో స్నానం చేయొచ్చా..?
జ్వరంగా ఉన్నప్పుడు చల్లటి నీటితో స్నానం చేయొద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చల్లటి నీరు శరీరాన్ని అకస్మాత్తుగా చల్లబరుస్తుంది. దీనివల్ల వణుకు, అసౌకర్యం మరింత పెరిగి జ్వరం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

