వర్షాకాలం వచ్చిందంటే చాలు... జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వెంటాడుతూనే ఉంటాయి. తేమతో కూడిన వాతావరణం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సోకుతుంటాయి. మందులు వాడకుండానే గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే... ఈ 6 సులభమైన ఆయుర్వేద ఇంటి చిట్కాలు ప్రయత్నించండి.
1. అల్లం,తేనె..
కొద్దిగా అల్లం రసం తీసి, అందులో తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతుకు ఉపశమనం కలిగిస్తాయి.
2. పసుపు పాలు..
రాత్రి పడుకునే ముందు వేడి పాలలో పసుపు కలిపి తాగడం సంప్రదాయ చిట్కా. పసుపులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి, దగ్గు నుంచి ఉపశమనం ఇస్తాయి.
3. తులసి కషాయం..
తులసి ఆకులు, అల్లం, మిరియాలు వేసి మరిగించిన కషాయం తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గి, శ్వాసకోశ వ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది.
4. ఆవిరి పట్టడం..
వేడి నీటిలో యూకలిప్టస్ నూనె లేదా విక్స్ వేసి ఆవిరి పట్టడం వల్ల ముక్కు దిబ్బడ, గొంతులో పట్టు తగ్గి ఊపిరి తీసుకోవడం సులువవుతుంది.
5. వేడి నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం..
గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలిస్తే గొంతులో ఇన్ఫెక్షన్, వాపు తగ్గి ఉపశమనం కలుగుతుంది.
6. తగినంత విశ్రాంతి, ద్రవాహారం..
శరీరానికి తగినంత నిద్ర, వేడి నీరు, సూప్‌లు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి త్వరగా కోలుకోవచ్చు. ఈ చిట్కాలు సాధారణ దగ్గు, జలుబుకు ఉపశమనం ఇస్తాయి. లక్షణాలు ఎక్కువ రోజులు కొనసాగితే లేదా తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

