మానేయాల్సిన విరుద్ధ ఆహారాలు.. పాలు,పండ్లు ముఖ్యంగా అరటిపండు, సిట్రస్ పండ్లు, పాలు ఉప్పు, చేపలు,పెరుగు వంటి విరుద్ధ కలయికలను పూర్తిగా దూరం పెట్టాలి. ఇవి కడుపులో పులిసిపోయి తీవ్రమైన గ్యాస్కు కారణమవుతాయి.
నీరు ఎప్పుడు తాగాలి..?
'భోజనాగ్రే విషం వారి, భోజనాంతే విషప్రదం' భోజనానికి ముందు లేదా తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీరు తాగితే జఠరాగ్ని చల్లారిపోయి అజీర్తి వస్తుంది. భోజనం మధ్యలో అవసరమైతే మాత్రమే కొద్దికొద్దిగా గోరువెచ్చని నీరు తాగాలి. తిన్న 45 నిమిషాల తర్వాతే నీరు తీసుకోవాలి.
ఆహార పరిమాణం.. సూర్యుడు నడినెత్తిన ఉండే మధ్యాహ్న సమయంలో జీర్ణశక్తి గరిష్టంగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం భారీ భోజనం చేయాలి. రాత్రి సూర్యాస్తమయం తర్వాత అగ్ని మందగిస్తుంది కాబట్టి చాలా తేలికైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.
జీవనశైలి,యోగా నియమాలు..
ఆహారంతో పాటు తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం..వజ్రాసనం, వామకుక్షి..భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు; కనీసం 10,15 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోవడం వల్ల కడుపు భాగంలో రక్తప్రసరణ పెరిగి జీర్ణక్రియ వేగవంతమవుతుంది. పడుకునేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణాశయం ఆకృతి కారణంగా యాసిడ్ రిఫ్లక్స్ కాకుండా ఆగుతుంది.
మొబైల్ స్క్రీన్ల ప్రభావం..తింటున్నప్పుడు మాట్లాడటం లేదా టీవీ, మొబైల్ చూడటం వల్ల గాలి ఎక్కువగా లోపలికి వెళ్లి గ్యాస్ సమస్య పెరుగుతుంది. ఒత్తిడి, జీర్ణకోశ బంధం.. గట్-బ్రెయిన్ కనెక్షన్ ప్రకారం మెదడు ఒత్తిడికి గురైనప్పుడు జీర్ణవ్యవస్థ రక్తప్రసరణ మందగించి యాసిడ్ అధికంగా విడుదలవుతుంది. అందుకే రోజూ ప్రాణాయామం తప్పనిసరి.
ప్రాణాంతక నిర్లక్ష్యం వద్దు.. ఎప్పుడు అప్రమత్తం కావాలి..?
మలబద్ధకం ఉన్నప్పుడు వ్యర్థాలు పేగుల్లోనే ఆగిపోయి విషవాయువులను పైకి నెడతాయి. దీనివల్ల గ్యాస్ ఛాతీని పట్టేసినట్లు అనిపిస్తుంది. గ్యాస్ నొప్పి vs గుండెపోటు.. గ్యాస్ వల్ల వచ్చే నొప్పి సాధారణంగా పొట్ట పైభాగంలో ప్రారంభమై త్రేన్పులు వచ్చినప్పుడు లేదా కూర్చున్న పొజిషన్ మారినప్పుడు తగ్గుతుంది. అయితే గుండెపోటు నొప్పి ఛాతీ మధ్యలో బరువుగా నొక్కినట్లు ఉండి, ఎడమ చేతికి, దవడకు లేదా వీపుకు పాకుతుంది.చెమటలు పట్టడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్లాలి.
అల్సర్ల ముప్పు..దీర్ఘకాలిక ఎసిడిటీని పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు తాత్కాలిక యాంటాసిడ్లు వాడితే జీర్ణాశయ గోడలు క్షీణించి అల్సర్లు, GERD, అన్నవాహిక ఇన్ఫెక్షన్లుగా మారే ప్రమాదం ఉంది. మూలకారణమైన జీవనశైలిని ఆయుర్వేద మార్గంలో సరిదిద్దుకోవడమే ఆరోగ్యానికి నిజమైన రక్ష.


