తల ఒకవైపు భరించలేనంత నొప్పి, కాంతి, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం.. ఇవన్నీ మైగ్రేన్ బాధితులకు నిత్య నరకం చూపిస్తాయి. సాధారణ తలనొప్పితో పోలిస్తే ఇది రోజువారీ పనులను, నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు తక్షణ ఉపశమనం కోసం చాలామంది ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వింత చిట్కాలు, నాటు పద్ధతులను గుడ్డిగా పాటిస్తుంటారు. వీటిలో కొన్ని తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, మరికొన్ని ప్రాణాలకే ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైగ్రేన్ ఉపశమనానికి ఎక్కువగా ప్రచారంలో ఉన్న పద్ధతులు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలు పరిశీలిస్తే..
1. చీకటి, ప్రశాంతమైన గదిలో విశ్రాంతి..
మైగ్రేన్ దాడి చేసినప్పుడు వెలుతురు ఫోటోఫోబియా, శబ్దాలు ఫోనోఫోబియా నొప్పిని తీవ్రతరం చేస్తాయి. ఇలాంటప్పుడు కాంతి తక్కువగా ఉండే నిశ్శబ్ద గదిలో కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం లేదా కాసేపు నిద్రపోవడం నాడీ వ్యవస్థను శాంతింపజేసి మంచి ఉపశమనం ఇస్తుంది.
2. కోల్డ్ క్యాప్ లేదా ఐస్ ప్యాక్ వాడకం..
నుదుటిపై లేదా మెడ వెనుక భాగంలో చల్లటి పట్టీ లేదా ఐస్ ప్యాక్ ఉంచడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఇది నొప్పిని ఉపశమింపజేసేందుకు తోడ్పడే తాత్కాలిక ప్రక్రియ మాత్రమే కానీ శాశ్వత పరిష్కారం కాదు.
3. తగినంత నీరు తాగడం..
శరీరంలో నీటి శాతం తగ్గడం మైగ్రేన్ నొప్పికి ప్రధాన కారణాల్లో ఒకటి. రోజువారీగా తగినంత నీరు తాగడం వల్ల మైగ్రేన్ దాడులను నివారించవచ్చు. అయితే నొప్పి మొదలయ్యాక అమితంగా ఒకేసారి నీరు తాగడం వల్ల ప్రయోజనం ఉండదు.
4. బోటాక్స్ చికిత్స (Botox Treatment)
దీర్ఘకాలికంగా నెలలో 15 రోజులకు పైగా మైగ్రేన్‌తో బాధపడేవారికి వైద్యులు బోటాక్స్ ఇంజెక్షన్లను నివారణ చికిత్సగా సిఫార్సు చేస్తారు. ఇది సాధారణ తలనొప్పులకు తక్షణ నివారణ కాదు. కేవలం అర్హత కలిగిన న్యూరాలజిస్టు పర్యవేక్షణలోనే దీనిని తీసుకోవాలి.
ప్రమాదకరం.. దూరంగా ఉండాల్సిన వైరల్ చిట్కాలు..!
5. వేడి నీటిలో కాళ్లు.. తలపై ఐస్ ప్యాక్..?
పాదాలను వేడి నీటిలో ఉంచి, తలపై మంచుగడ్డ పెట్టడం వల్ల రక్తం కిందికి ప్రవహించి తలనొప్పి తగ్గుతుందనే ప్రచారం ఉంది. తలపై చల్లదనం కొంత ఉపశమనం ఇచ్చినా, వేడి నీటి ప్రక్రియ వల్ల మైగ్రేన్ తగ్గుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.
6. ఫ్రెంచ్ ఫ్రైస్, శీతల పానీయాలు..
కొందరు మైగ్రేన్ వచ్చినప్పుడు వేయించిన బంగాళాదుంపలు, కూల్ డ్రింక్స్ తీసుకుంటే తగ్గుతుందని నమ్ముతారు. కూల్ డ్రింక్స్‌లోని కెఫిన్ వల్ల కొంత ఉపశమనం అనిపించవచ్చు, కానీ జంక్ ఫుడ్‌ను మైగ్రేన్ ఔషధంగా భావించడం అనారోగ్యకరం.
7. మెడను బలంగా తిప్పడం లేదా విరవడం (Neck Manipulation)
తలనొప్పి తగ్గడానికి మెడను వేగంగా అటూఇటూ తిప్పడం, మెడ నరాలను ఒత్తి విరవడం అత్యంత ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల వెన్నుపాము, మెడలోని రక్తనాళాలు దెబ్బతినే తీవ్రమైన రిస్క్ ఉంటుంది.
8. తలపై బాటిల్‌తో కొట్టుకోవడం
ఇటీవల సోషల్ మీడియాలో నీళ్ల బాటిల్‌ను తలపై కొట్టుకోవడం ద్వారా నొప్పి నరాల దృష్టి మళ్లుతుందనే అర్థరహిత ప్రచారాలు కనిపిస్తున్నాయి. తలపై పదే పదే కొట్టుకోవడం వల్ల మెదడుకు అంతర్గత గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి వింత చేష్టలను ఎట్టిపరిస్థితుల్లో ప్రయత్నించకూడదు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
మైగ్రేన్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. మెరుపు వేగంతో అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం, కంటిచూపు మందగించడం, శరీరంలో ఒకవైపు బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది లేదా తికమక పడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.


