నేటి ఉరుకుల పరుగుల జీవనంలో మొబైల్ ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. ఆఫీస్ మెసేజ్లు, సోషల్ మీడియా అప్డేట్లు, అర్జంట్ కాల్స్ వల్ల చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతున్న సమయంలోనూ ఫోన్ వైపే చూస్తుంటారు. చిన్నారి ఎంతో ఉత్సాహంగా ఏదో చెప్పాలని వచ్చినప్పుడు.. ‘ఒక్క నిమిషం ఆగు’ అంటూ స్క్రీన్పై దృష్టి పెట్టడం చాలా ఇళ్లలో సాధారణ దృశ్యంగా మారింది. ఇది పైకి చిన్న విషయంగా అనిపించినా, పదేపదే ఇలా జరిగితే పిల్లల మానసిక వికాసంపై, బంధంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిల్లలపై పడే ప్రభావాలు..
పిల్లలు తమ భావాలను పంచుకోవడానికి వచ్చినప్పుడు పెద్దలు ఫోన్లో మునిగిపోతే, తమ మాటకు విలువ లేదనే భావన వారిలో మొదలవుతుంది. క్రమంగా వారు ఆత్మన్యూనతకు లోనయ్యే అవకాశం ఉంది.
పిల్లలు రోజంతా జరిగిన విషయాలను తల్లిదండ్రులతో పంచుకోవడం ద్వారానే మాట్లాడటం, భావాలను పంచుకోవడం నేర్చుకుంటారు. వారు మాట్లాడుతున్నప్పుడు పెద్దల ఏకాగ్రత పదేపదే చెదిరితే, విషయాలను పంచుకోవాలనే ఆసక్తిని కోల్పోతారు.
సమయం ఉన్నా.. సాన్నిహిత్యం ఉండదు.. పిల్లల పక్కనే ఒకే గదిలో కూర్చోవడం వేరు, వారికి పూర్తి ఏకాగ్రతతో సమయం కేటాయించడం వేరు. ఆడుకుంటున్నప్పుడు లేదా భోజనం చేస్తున్నప్పుడు కూడా ఫోన్ వాడుతుంటే, ఆ సాన్నిహిత్యానికి నాణ్యత లోపిస్తుంది.
తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు..
గ్యాడ్జెట్-ఫ్రీ సమయం..రోజులో కనీసం కొంత సమయాన్ని ‘నో ఫోన్ టైమ్’గా నిర్ణయించుకోండి. ఆ సమయంలో ఫోన్ను పక్కనపెట్టి పిల్లలతో ఆటలాడటం లేదా రోజంతా జరిగిన విషయాలను సరదాగా మాట్లాడటం అలవాటు చేసుకోండి.
పూర్తిగా వినండి.. పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు ఫోన్ కింద ఉంచి, వారి కళ్లలోకి చూస్తూ శ్రద్ధగా వినండి. వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తున్నామనే భరోసా ఇవ్వండి.
వివరించి చెప్పండి.. నిజంగానే ఏదైనా అత్యవసరమైన కాల్ లేదా పని ఉంటే.. ‘నేను కొద్దిసేపు ముఖ్యమైన పని పూర్తి చేసుకుని నీతో మాట్లాడతాను’ అని వారికి సున్నితంగా అర్థమయ్యేలా చెప్పండి.
భోజన సమయాల్లో స్క్రీన్లు వద్దు.. కుటుంబమంతా కలిసి భోజనం చేసే వేళల్లో మొబైల్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించండి. ఇది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సంభాషణలకు చక్కటి వేదికగా మారుతుంది.
ఆదర్శంగా నిలవండి.. పిల్లలు ఎప్పుడూ పెద్దల ప్రవర్తనను చూసే అనుకరిస్తారు. మనం ఫోన్ను మితంగా, అవసరమైనంత వరకే వాడితే పిల్లలు కూడా స్క్రీన్లకు బానిసలు కాకుండా ఉంటారు.
పిల్లలకు కేవలం మీ సమక్షం మాత్రమే కాదు.. మీ పూర్తి ఏకాగ్రత, శ్రద్ధ కూడా చాలా అవసరం. ఫోన్ వినియోగాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ ఎప్పుడు ఫోన్ ముఖ్యం.. ఎప్పుడు పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేది గ్రహించగలిగితే వారి ఎదుగుదలకు, బలమైన అనుబంధానికి చక్కటి పునాది పడుతుంది.


