వేసవి కాలం ముదిరే కొద్దీ భానుడి భగభగలకు తోడు ఉక్కపోత సాధారణం కావడంతో, నగరాల్లో ఎయిర్ కండిషనర్లు విలాస వస్తువు కాకుండా ఒక అనివార్య అవసరంగా మారిపోయాయి. ఇల్లు, ఆఫీసు, కారు.. ఇలా ఎక్కడ చూసినా ప్రజలు పగలు, రాత్రి తేడా లేకుండా ఏసీ చల్లని గాలిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే రోజుల్లో 24 గంటలూ ఏసీ వాతావరణంలోనే గడిపే వారి సంఖ్య తక్కువేమీ కాదు.అయితే, నిరంతరం ఏసీ గాలికి గురికావడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ, ఇది ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు ఎయిర్ కండిషనర్ల కింద కూర్చోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి తగ్గడమే కాకుండా పలు రకాల ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుంది.రోజుమొత్తం ఏసీలోనే గడపడం వల్ల తలెత్తే ప్రధాన ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ మార్గాలపై ప్రత్యేక కథనం...
1. చర్మం పొడిబారడం.. నిర్జలీకరణ (Dehydration)ఎయిర్ కండిషనర్లు గదిలోని వేడిని తగ్గించే క్రమంలో అక్కడి తేమను (Moisture) పూర్తిగా పీల్చేస్తాయి. దీని ప్రభావం నేరుగా మన శరీరంపై పడుతుంది.
ముప్పు..చర్మం తన సహజ సిద్ధమైన తేమను కోల్పోయి బిగుతుగా మారడం, పొడిబారడం, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి.
నిర్జలీకరణ..ఏసీ వాతావరణంలో శరీరానికి చెమట పట్టకపోవడం వల్ల చాలామందికి దాహం వేయదు. ఫలితంగా తగినంత నీరు తాగడం మరచిపోతారు. ఇది శరీరంలో నీటి శాతాన్ని తగ్గించి నిర్జలీకరణకు దారితీస్తుంది.
2. శ్వాసకోశ ఇబ్బందులుఏసీ నుంచి వచ్చే చల్లని గాలి నిరంతరం పీల్చడం వల్ల ముక్కు, గొంతు భాగాల్లో ఉండే శ్లేష్మ పొరలు (Mucous Membranes) పొడిబారిపోతాయి.
ముప్పు: గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, నిరంతర దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
ఫిల్టర్ల నిర్లక్ష్యం: ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే, వాటిలో దుమ్ము, ధూళితో పాటు ప్రమాదకరమైన బ్యాక్టీరియా, ఫంగస్ చేరుతాయి. ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆస్తమా, అలర్జీ బాధితుల సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి.
3. నిరంతర తలనొప్పి.. తీవ్ర అలసటచాలా చల్లని వాతావరణం నుండి అకస్మాత్తుగా బయటి వేడి వాతావరణంలోకి రావడం, మళ్లీ ఏసీ గదిలోకి వెళ్లడం వల్ల శరీరం నిరంతరం మారుతున్న ఉష్ణోగ్రతలకు సర్దుబాటు కాలేకపోతుంది.
ముప్పు: తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ రేకెత్తడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అత్యంత చల్లని ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో రక్త ప్రసరణ (Blood Circulation) మందగించి, రోజంతా ఏసీలో కూర్చున్నా కూడా శరీరం నీరసంగా, శక్తిహీనంగా మారినట్లు అనిపిస్తుంది.
4. కీళ్లు, కండరాల నొప్పులుఏసీ నుంచి వచ్చే చల్లని గాలి శరీర కండరాలు, కీళ్లపై నేరుగా ప్రభావం చూపుతుంది.
ముప్పు..ఎక్కువ సేపు చలి వాతావరణంలో కూర్చోవడం వల్ల కండరాలు బిగుసుకుపోయి గట్టిపడతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ లేదా దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారిలో ఈ సమస్యలు రెట్టింపవుతాయి. చాలామందిలో మెడ, భుజాలు, నడుము నొప్పి రావడానికి నిరంతర ఏసీ వాడకమే ప్రధాన కారణం.5. కళ్లలో పొడిబారడం (Dry Eyes)కంప్యూటర్లు, మొబైల్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడిపేవారికి ఏసీ వాతావరణం తోడైతే కంటి సమస్యలు మరింత పెరుగుతాయి.
ముప్పు..గదిలో తేమ లేకపోవడం వల్ల కళ్లలోని లూబ్రికేషన్ తగ్గి ఎర్రబడటం, దురద, మంట వంటి చికాకులు వస్తాయి. కాంటాక్ట్ లెన్సులు ధరించే వ్యక్తులు ఏసీలో ఉన్నప్పుడు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు.
6. రోగనిరోధక శక్తి (Immunity) క్షీణతనిరంతరం మూసివున్న కృతిమ చల్లటి వాతావరణంలోనే గడపడం వల్ల మన శరీరం బాహ్య వాతావరణ మార్పులను తట్టుకునే సహజ సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనివల్ల వాతావరణం కొద్దిగా మారినా త్వరగా జలుబు, జ్వరం, వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
జాగ్రత్తలు..
ఏసీ వల్ల వచ్చే ఆరోగ్య నష్టాల నుండి బయటపడటానికి వైద్యులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు:ఉష్ణోగ్రత నియంత్రణ: ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా కాకుండా ఎల్లప్పుడూ 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ 24 నుంచి 26 మధ్య ఉంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.
నీరు ఎక్కువగా తాగాలి..ఏసీ గదిలో ఉన్నప్పటికీ దాహంతో సంబంధం లేకుండా గంటకొకసారి నీళ్లు తాగుతుండాలి. చర్మాన్ని కాపాడుకోవడానికి మంచి మాయిశ్చరైజర్ను ఉపయోగించాలి.
ఫిల్టర్ల పరిశుభ్రత.. ఏసీ ఫిల్టర్లను కనీసం నెలకోసారైనా శుభ్రం చేయించుకోవాలి. కళ్లలో డ్రైనెస్ ఎక్కువగా ఉంటే నిపుణుల సలహాతో లుబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడాలి. సహజ వాతావరణం: రోజులో కొంత సమయం ఏసీని ఆపివేసి, కిటికీలు తెరిచి ఉంచడం ద్వారా గదిలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. అలాగే కాసేపు ఆరుబయట శారీరక శ్రమ లేదా నడక సాగించడం మంచిది.

