వాతావరణంలో మార్పులు రాగానే చిన్నపాటి గొంతునొప్పి, తుమ్ములు, దగ్గు రావడం సర్వసాధారణం. చాలామంది దగ్గు రాగానే పెద్దగా ఆలోచించకుండా నేరుగా మెడికల్ షాపునకు వెళ్లి దగ్గు మందులు కొనేస్తుంటారు. అయితే, కేంద్ర ప్రభుత్వం దీనిపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇకపై వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే దగ్గు సిరప్‌లను విక్రయించాలని నిబంధనలను కఠినతరం చేసింది.
గత సంవత్సరం మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కలుషిత దగ్గు సిరప్‌లు తాగి పలువురు చిన్నారులు మరణించిన ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దర్యాప్తులో.. 'శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్' అనే సంస్థ తయారు చేసిన సిరప్‌లలో 'డైఇథైలీన్ గ్లైకాల్' అనే ప్రమాదకరమైన పారిశ్రామిక రసాయనం అధిక స్థాయిలో ఉన్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం ఆ సంస్థ లైసెన్స్‌ను రద్దు చేసి, కంపెనీని మూసివేయించింది. ఈ నేపథ్యంలోనే ఓవర్-ది-కౌంటర్ (నేరుగా) సిరప్‌ల అమ్మకాలపై నిషేధం విధించారు.
దగ్గు ఎందుకు వస్తుంది..?
వైద్యుల ప్రకారం, ప్రతి దగ్గుకూ మందులు వాడాల్సిన అవసరం లేదు. నిజానికి దగ్గు అనేది ఒక వ్యాధి కాదు, అది శరీరం యొక్క ఒక రక్షణ యంత్రాంగం.
స్వయంగా శుభ్రం చేసుకోవడం.. దుమ్ము, ధూళి, వైరస్‌లు, బ్యాక్టీరియా, పొగ లేదా అలర్జీ కారకాలు శ్వాసనాళంలోకి చేరినప్పుడు.. వాటిని బయటకు పంపేందుకు శరీరం దగ్గు రూపంలో ప్రయత్నిస్తుంది.
పర్యావరణ కారకాలు.. వాయు కాలుష్యం, ఉష్ణోగ్రతల్లో మార్పులు, పీఎం 2.5 రేణువులు శ్వాసకోశ మార్గాన్ని ప్రభావితం చేయడం వల్ల గొంతులో చికాకు, దగ్గు వస్తాయి.
ఆస్తమా, ఇన్‌ఫెక్షన్లు..ఆస్తమా వల్ల శ్వాసమార్గాలు సన్నబడి పొడిదగ్గు వస్తుంది. అలాగే న్యుమోనియా, కోరింత దగ్గు వంటి తీవ్ర ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా దగ్గు వస్తుంది.
క్షయవ్యాధి (TB) ముప్పు..దగ్గు గనుక మూడు వారాల కంటే ఎక్కువ కాలం ఉంటూ, బరువు తగ్గడం లేదా ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటే అది క్షయవ్యాధికి సంకేతం కావచ్చు. దీనికి తక్షణ వైద్య పరీక్షలు అవసరం.
మందులు లేకుండా ఉపశమనం కలిగించే ‘ఇంటి చిట్కాలు’
సాధారణ లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే దగ్గును కొన్ని సులభమైన నివారణలతో నయం చేయవచ్చు:
పుష్కలంగా ద్రవపదార్థాలు..కఫం పల్చగా మారడానికి రోజంతా తగినంత నీరు, వెచ్చని ద్రవపదార్థాలు తీసుకోవాలి.
ఉప్పునీటి పుక్కిలించడం..గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలించడం (Gargling) వల్ల గొంతు వాపు, అసౌకర్యం చాలా వరకు తగ్గుతాయి.
ఆవిరి పట్టడం..వేడి నీటి ఆవిరిని పీల్చడం ద్వారా శ్వాసనాళాలు తేమగా మారి, గాలి ఆడే మార్గంలో అడ్డంకులు తొలగుతాయి.
తేనె వాడకం..ఏడాది వయసు దాటిన పిల్లల్లో గొంతు చికాకును, దగ్గు తీవ్రతను తగ్గించడానికి తేనె అద్భుతంగా పనిచేస్తుంది.
ధూమపానానికి దూరం..ధూమపానం చేసే అలవాటును మానాలి, అలాగే ఇతరులు వదిలే పొగకు (Passive smoking) దూరంగా ఉండాలి. లేదంటే దగ్గు మరింత తీవ్రమవుతుంది. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడుతుంది.
ఇల్లాంటి సాధారణ చర్యలతో దగ్గు తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఒకవేళ తగ్గకపోతే సొంతంగా సిరప్‌లు వాడకుండా, అర్హులైన వైద్యులను సంప్రదించి వారు సూచించిన మందులను మాత్రమే వాడటం సురక్షితం.

