వేసవి కాలంలో ఉక్కపోత, వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అత్యధిక శాతం మంది ఇళ్లలో ఎయిర్ కూలర్లను ఉపయోగిస్తుంటారు. ఏసీలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, చల్లని గాలిని అందించడంలో కూలర్లు చక్కగా ఉపయోగపడతాయి. అయితే, కూలర్ వాడే విషయంలో మనం చేసే ఒకే ఒక చిన్న నిర్లక్ష్యం.. మనల్ని, మన కుటుంబ సభ్యులందరినీ ఆసుపత్రి పాలు చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కూలర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం వల్ల అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మురికి కూలర్ల వల్ల కలిగే నష్టాలు, వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు చూద్దాం..
మురికి తో ముప్పు..
కూలర్లలో ఉండే హనీకోంబ్ లేదా గడ్డి ప్యాడ్‌లను సరిగ్గా శుభ్రం చేయకపోతే, అక్కడ పేరుకుపోయే తేమ కారణంగా దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా మరియు ఫంగస్ (బూజు) వేగంగా వృద్ధి చెందుతాయి. కూలర్ ఆన్ చేసినప్పుడు ఈ కలుషితాలు గాలి ద్వారా గది అంతటా వ్యాపించి శ్వాసతో పాటు శరీరంలోకి చేరుతాయి.
1. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు..
మురికి ప్యాడ్‌ల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి, మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆస్తమా, సైనసైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ కలుషిత గాలి వల్ల ఆయాసం మరింత తీవ్రమవుతుంది. దీర్ఘకాలంలో ఇది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కూడా దారితీయవచ్చు.
2. అలర్జీలు, చర్మ వ్యాధులు..
కూలర్ లోపల తేమ వల్ల ఫంగస్ వేగంగా పెరుగుతుంది. ఈ ఫంగస్ కణాలు గాలిలో కలిసి కళ్లలోకి, చర్మంపైకి చేరడం వల్ల కళ్లు ఎర్రబడటం, దురద పెట్టడం, చర్మంపై దద్దుర్లు రావడం వంటి అలర్జీ ప్రతిచర్యలు (Allergic reactions) కనిపిస్తాయి.
3. గదిలో దుర్వాసన - కలుషిత గాలి..
చాలా రోజుల పాటు కూలర్ ట్యాంక్ లోని నీటిని మార్చకపోతే, అందులోని నాచు, మురికి కారణంగా ఒక రకమైన వింతైన దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. ఈ గాలి పీల్చడం వల్ల గదిలో ప్రశాంతత దెబ్బతినడమే కాకుండా తలనొప్పి, వికారం, అసౌకర్యం కలుగుతాయి.
4. ఇన్ఫెక్షన్లు, జ్వరాల భయం..
కూలర్ లోని నిల్వ నీరు బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. అంతేకాకుండా, దోమలు గుడ్లు పెట్టడానికి ఇది అనుకూలమైన వాతావరణం. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గాలి ద్వారా వ్యాపించే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల జ్వరం, నీరసం వస్తాయి.
5. చిన్న పిల్లలు, వృద్ధులకు మరింత ప్రమాదం..
ఇంట్లోని చిన్న పిల్లలు, వృద్ధులలో రోగనిరోధక శక్తి (Immunity) తక్కువగా ఉంటుంది. అందువల్ల మురికి కూలర్ నుంచి వచ్చే గాలి ప్రభావం వీరిపై చాలా వేగంగా పడుతుంది. వారు త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడి ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉంది.
కూలర్ వల్ల అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తప్పక పాటించాలి.
నీటిని మార్చడం: కూలర్ ట్యాంక్‌లోని నీటిని ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి పూర్తిగా తీసివేసి, కొత్త నీటిని నింపాలి.
ప్యాడ్‌ల శుభ్రత..
కూలర్ ప్యాడ్‌లను (గడ్డి లేదా హనీకోంబ్) నెలకు కనీసం రెండు సార్లు అయినా విప్పి, రన్నింగ్ వాటర్ కింద క్షుణ్ణంగా కడగాలి. బాగా పాడైపోతే వెంటనే కొత్తవి వేయాలి.
ట్యాంక్ వాషింగ్..
నీరు నిల్వ ఉండే ట్యాంకును కేవలం నీటితోనే కాకుండా, బ్రష్‌తో రుద్ది, నాచు పట్టకుండా శుభ్రం చేయాలి.
యాంటీ బ్యాక్టీరియల్ ద్రవాలు..
కూలర్ నీటిలో కాస్త వేప నూనె లేదా మార్కెట్లో దొరికే యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ లార్వా ద్రవాలను కొన్ని చుక్కలు వేయడం ద్వారా దోమలు, బ్యాక్టీరియా చేరకుండా చూసుకోవచ్చు.
వెంటిలేషన్ ముఖ్యం..కూలర్ వాడేటప్పుడు గది తలుపులు, కిటికీలు పూర్తిగా బంద్ చేయకూడదు. గదిలో గాలి బయటకు వెళ్లే మార్గం (వెంటిలేషన్) ఉంటేనే కూలర్ చల్లదనంతో పాటు తాజా గాలి లభిస్తుంది, ఉక్కపోత తగ్గుతుంది.వేసవి ఉపశమనం కోసం వాడే కూలర్ మన ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదంటే.. వారంలో కనీసం ఒక్క రోజైనా దాన్ని శుభ్రం చేయడానికి కేటాయించడం ఎంతో అవసరం.

