▶ Reels

భోజనం తర్వాత స్వీట్ తింటున్నారా..? ‘షుగర్ క్రాష్’ ముప్పుపై వైద్య నిపుణుల హెచ్చరిక..

 


గులాబ్ జామున్, రసగుల్లా, నోరూరించే చాక్లెట్లు.. పేరు వింటేనే నాలుకపై తీపి ఊరుతుంది. ముఖ్యంగా భోజనం ముగియగానే ఏదో ఒక తీపి పదార్థం నోట్లో పడాల్సిందేనని చాలా మంది మంకుపట్టు పడుతుంటారు. మధుమేహం వస్తుందేమోననే భయం గుండెల్లో ఉన్నా, ఆ తీపి కోరికను మాత్రం అదుపు చేసుకోలేకపోతుంటారు. ఒకవేళ మీ పరిస్థితి కూడా ఇదే అయితే.. మీరు ఒంటరి కారు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇదే ‘తీపి’ బంధంలో చిక్కుకున్నారు. ఇంతకీ ఈ తియ్యని కోరిక వెనుక ఉన్న రహస్యం ఏంటి..? మనం తినే చక్కెర శరీరంలోకి వెళ్లాక ఎలాంటి విలయం సృష్టిస్తోంది..? అంటే..? 

మెదడును మాయ చేసే ‘రివార్డ్ సిస్టమ్’..

మనం తీపి పదార్థాలు తిన్నప్పుడు, అది నాలుక, ప్రేగులలోని రుచి గ్రాహకాలను (Taste Receptors) ఉత్తేజపరుస్తుంది. ఇది నేరుగా మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్‌’ను ప్రేరేపించి, డోపమైన్ (Dopamine) అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఈ రసాయనం మనకు క్షణాల్లో ఒకలాంటి సంతోషాన్ని, తృప్తిని ఇస్తుంది. అందుకే ఒత్తిడి, అలసట, లేదా విచారంలో ఉన్నప్పుడు చాలా మందికి తీపి తినాలనే కోరిక తీవ్రమవుతుంది. అయితే ఈ క్షణికానందం మరిన్ని తీపి పదార్థాలు తినాలనే వ్యసనానికి దారితీస్తుంది.

నోటి నుంచి మొదలు.. నిమిషాల్లో మార్పులు..!
చక్కెర కేవలం నోటి రుచిని మార్చడమే కాదు, తిన్న కొద్ది నిమిషాల్లోనే రక్తం, మెదడు, హార్మోన్లలో పెను మార్పులు తీసుకొస్తుంది. చక్కెరలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. జీర్ణక్రియలో ఇవి విచ్ఛిన్నమై నేరుగా రక్తంలో కలవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి.

ఇన్సులిన్ పై ఒత్తిడి..

గ్లూకోజ్ పెరగగానే క్లోమ గ్రంథి (Pancreas) ఇన్సులిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ గ్లూకోజ్‌ను కణాలకు చేర్చి శక్తిగా మార్చడం ఇన్సులిన్ పని. అయితే, నిరంతరం చక్కెరలు ఎక్కువగా తీసుకుంటే కణాలు ఇన్సులిన్‌ను నిరోధించడం (Insulin Resistance) మొదలుపెడతాయి. ఫలితంగా గ్లూకోజ్ కణాల్లోకి వెళ్లకుండా రక్తంలోనే పేరుకుపోయి మధుమేహానికి దారితీస్తుంది.

తక్షణ శక్తి.. ఆపై ‘షుగర్ క్రాష్’..!

తీపి పదార్థాలు త్వరగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అందుకే తీపి తిన్న వెంటనే ఉత్సాహం వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ, ఈ తక్షణ శక్తి ఎంత వేగంగా వస్తుందో, అంతే వేగంగా పడిపోతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘షుగర్ క్రాష్’ (Sugar Crash) అంటారు. దీనివల్ల కొద్దిసేపటికే మళ్లీ నీరసం, అలసట ఆవహిస్తాయి.

చక్కెరతో శరీరానికి ముప్పే.. అవయవాలపై తీవ్ర ప్రభావం..!

అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల కేవలం బరువు పెరగడం, మధుమేహం రావడం మాత్రమే కాదు.. శరీరంలోని అంతర్గత అవయవాలు, హార్మోన్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం చక్కెర తిన్నప్పుడు అది మన ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యతను పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఫలితంగా పొట్ట నిండినా ఇంకా ఏదో ఒకటి తినాలనే కోరిక (Cravings) నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. దీనికి తోడు, చక్కెరలో ఉండే ఫ్రక్టోజ్ కేవలం కాలేయంలోనే (Liver) జీర్ణమవుతుంది. పరిమితికి మించి ఫ్రక్టోజ్ శరీరంలోకి చేరినప్పుడు కాలేయంపై విపరీతమైన భారం పడి, అది కాస్తా ‘ఫ్యాటీ లివర్’ (Fatty Liver) సమస్యకు దారితీస్తుంది.

మరోవైపు, చక్కెర ప్రభావం నోటి ఆరోగ్యంపై కూడా తీవ్రంగా ఉంటుంది. నోటిలోని హానికర బ్యాక్టీరియా మనం తినే చక్కెర అవశేషాలను ఆహారంగా మార్చుకుని ప్రమాదకరమైన ఆమ్లాలను (Acids) విడుదల చేస్తుంది. ఈ ఆమ్లాలు దంతాల రక్షణ పొర అయిన ఎనామెల్‌ను క్రమంగా క్షీణింపజేసి పళ్లు పుచ్చిపోయేలా చేస్తాయి. అన్నింటికంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. రక్తంలో అధికంగా చేరే చక్కెర కాలక్రమేణా రక్తనాళాల్లో అంతర్గత వాపునకు (Inflammation) కారణమవుతుంది. ఈ దీర్ఘకాలిక వాపు వల్ల గుండె జబ్బులు, ఇతర హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. వీటన్నింటి సమిష్టి ఫలితంగా, చక్కెర ద్వారా లభించే అదనపు క్యాలరీలు శరీరంలో కరగకుండా ఉండిపోతాయి. ఆ అదనపు శక్తిని శరీరం కొవ్వు రూపంలో నిల్వ చేయడం వల్ల అది ‘ఊబకాయం’ (Obesity) వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలకు మూలమవుతుంది.

తీపి తినాలనే కోరిక సహజమే అయినప్పటికీ, శీతల పానీయాలు, బేకరీ వస్తువులు, రిఫైండ్ చక్కెరలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వాటికి బదులుగా సహజసిద్ధమైన తీపి ఉండే పండ్లు, కొద్దిపాటి బెల్లం లేదా ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Related Blogs


ఈ పండ్లను కలిపి తింటే అనారోగ్య సమస్యలు తప్పవు ..

June 19, 2026

ఆరోగ్యంగా ఉండటాని...

READ MORE

ప్రతి దగ్గుకూ సిరప్ అవసరమా?.. ఇకపై డాక్టర్ చిట్టీ ఉంటేనే అమ్మకాలు..!

June 19, 2026

వాతావరణంలో మార్పు...

READ MORE

రక్తంలో చక్కెరను అదుపు చేసే అమృతపానం..మధుమేహ బాధితులకు కాకరకాయ రసంతో మేలు..!

June 17, 2026

ప్రస్తుత కాలంలో డయ...

READ MORE

భోజనం తర్వాత స్వీట్ తింటున్నారా..? ‘షుగర్ క్రాష్’ ముప్పుపై వైద్య నిపుణుల హెచ్చరిక..

June 16, 2026

 గులాబ్ జామున్, ర...

READ MORE

చక్కెరకు బైబై.. ప్రకృతి ప్రసాదించిన ప్రత్యామ్నాయ పదార్థాలు..!

June 16, 2026

తీపి తినాలనే కోరిక...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.